![వేర్వేరు చోట్ల నలుగురు సూసైడ్](https://static.v6velugu.com/uploads/2025/02/four-people-commit-dies-in-different-places_KX0Dhyi2zP.jpg)
- సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఆసిఫాబాద్ జిల్లాలో టెన్త్ స్టూడెంట్..
- తల్లి మందలించిందని భద్రాద్రిలో బాలిక, బుల్లెట్ బైక్ కొనివ్వలేదని యువకుడు..
- ప్రేమ విఫలమైందని పెద్దపల్లి జిల్లాలో మరో యువకుడు ఆత్మహత్య
కాగజ్‌నగర్/భద్రాచలం/అశ్వారావుపేట/ధర్మారం, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఇద్దరు బాలికలు, మరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఓ బాలిక, తల్లి మందలించిందని మరో బాలిక సూసైడ్ చేసుకోగా, బుల్లెట్ బైక్ కొనివ్వలేదని యువకుడు, ప్రేమ విఫలమై మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకు బొమ్మకంటి స్ఫూర్తి (16) స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
శనివారం కాగజ్‌నగర్‌లో నవోదయ ఎంట్రెన్స్ రాసి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత తాను చదివే స్కూల్‌కు వెళ్లి స్టడీ మెటీరియల్ తీసుకొని వచ్చింది. స్టడీ మెటీరియల్ పీడీఎఫ్‌లో ఉందని, ఫోన్ ఇస్తే చదువుకుంటానని తల్లి రమాదేవిని అడిగింది. అయితే ఫోన్ ఇస్తే ‘గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేస్తావు, స్టడీ మెటీరియల్‌ను ప్రింట్ తీసుకొని వస్తాను’ అంటూ రమాదేవి జీరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన స్ఫూర్తి ఇంట్లో ఉరి వేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత వచ్చిన రమాదేవి గదిలోకి వెళ్లి చూడగా కూతురు ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే భర్త సదానందంకు కాల్ చేయగా ఆయన వచ్చి కూతురిని కిందకు దింపి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిర్పూర్ టి సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.
తల్లి మందలించిందని...
తల్లి మందలించిందన్న కోపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. భద్రాచలం పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన రుత్వికానాయుడు (14) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రుత్విక గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. ఆదివారం ఉదయం చూసిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బుల్లెట్ కొనివ్వడం లేదని...
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఫైర్ కాలనీకి చెందిన చీకటి కొండయ్య, వరలక్ష్మి కుమారుడు స్వామి (22) కారు నడుపుతూ జీవిస్తున్నాడు. తన బుల్లెట్ బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను కొన్ని రోజులుగా అడుగుతున్నాడు. ఆదివారం మరోసారి పట్టుబట్టడంతో తర్వాత కొనిస్తానని చెప్పిన తండ్రి పనిమీద బయటకు వెళ్లగా, తల్లి సరుకుల కోసం షాప్‌కు వెళ్లింది. దీంతో స్వామి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. షాప్ నుంచి వచ్చిన తల్లి కిటికీలో నుంచి చూసేసరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులను బద్దలు కొట్టి, స్వామిని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.
ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని...
ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన గడ్డం అజయ్ (22) కొన్నేండ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని యువతిని కోరగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అజయ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయాడు.